హోం వర్క్ చేయలేదని.. 168 చెంప దెబ్బలు

భోపాల్ : హోం వర్క్ చేయలేదని ఓ విద్యార్థినికి 168 చెంప దెబ్బలు కొట్టించాడు ఉపాధ్యాయుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని థండ్ల పట్టణంలోని నవోదయ విద్యాలయంలో ఇటీవలే చోటు చేసుకుంది. ఆరో తరగతి చదువుతోన్న 12 ఏళ్ల విద్యార్థినికి సైన్స్ టీచర్ మనోజ్ కుమార్ వర్మ హోం వర్క్ ఇచ్చాడు. అయితే విద్యార్థిని హోం వర్క్ చేయలేదు. దీంతో సదరు విద్యార్థినికి జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు 14 మంది తోటి విద్యార్థినులతో 168 చెంపదెబ్బలు కొట్టించాడు. ఉపాధ్యాయుడి దండనపై బాధిత బాలిక తన తండ్రికి చెప్పింది. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని తండ్రి.. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ కే సాగర్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ కే సాగర్ స్పందిస్తూ.. స్నేహపూర్వకంగా విధించిన శిక్షే అంటే సైన్స్ టీచర్‌ను వెనుకేసుకొచ్చారు. హోం వర్క్ చేయకపోవడంతో.. చదువులో పూర్తిగా వెనుకబడిపోయిందన్న కారణంతోనే అలా చేయాల్సి వచ్చిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ కూడా ఈ శిక్షను సమర్థించడంతో.. బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక బడికి వెళ్లేందుకు భయపడిపోతోందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*