మరక.. మౌనం.. ఏదీ మంచిది కాదు పవన్

మరకా మంచిదే అంటూ ఒక యాడ్ తరచూ టీవీ ఛానళ్లలో కనిపిస్తూ ఉంటుంది. అలా అని మరక మంచిదేనా? అంటే కాదనే చెప్పాలి. మరక లేకుండా డబ్బులిచ్చి కొనుక్కొని మరీ.. దాని వదిలించుకోవాల్సిన అవసరం ఉండదు కదా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికేం సమస్య వచ్చినా.. నొప్పి వచ్చినా పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తున్నారు. తమకొచ్చిన నొప్పులపై స్పందించాలని కోరుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ తప్పించి మరొకరు లేరా? అయినా.. రెండు రాష్ట్రాల్లోని అధికారపక్షాలకు చెందిన బొలెడంత మంది నేతలు ఉంటే వారిని వదిలేసి చాలామందికి పవన్ కల్యాణ్ మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకిలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు. సమస్యలు అందరికి ఉన్నా.. కొందరు మాత్రం టీవీ ఛానళ్లను ఆశ్రయింస్తుంటారు.టీవీ గొట్టాల ముందుకు వచ్చింది మొదలు పవన్ జపం చేస్తుంటారు. పవన్ రియాక్ట్ కావాలంటారు. తర్వాత రియాక్ట్ కాలేదని తిడతారు.

ఈ మధ్యన ఇలాంటివి అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. చిరు ప్రజారాజ్యం సమయంలో యువరాజ్యానికి ప్రాతినిధ్యం వహించిన పవన్ కల్యాణ్.. ఎవరేం అన్నా మాటకు మాట బదులిచ్చేవారు. అదే సమయంలో ప్రజారాజ్యం అధినేత హోదాలో ఉన్న చిరంజీవి మాత్రం ఆచితూచి అన్నట్లు వ్యవహరించేవారు. తన గురించి మాట్లాడే వారి గురించి ఏం మాట్లాడకుండా శాంతమూర్తిగా ఉండేవారు.

కొందరు చిరు తీరును మద్దతు పలికితే.. మరికొందరు మాత్రం సరిగా డీల్ చేయటం రాదనే విమర్శలు వినిపించేవి. మొత్తంగా చిరుపై సాఫ్ట్ గా దుష్ప్రచారం సాగేదన్నది మాత్రం నిజం. తాజాగా పవన్ కల్యాణ్ మీద కూడా అదే తరహాలో బురదజల్లుడు కార్యక్రమం మొదలైందని చెప్పక తప్పదు.

తనకే మాత్రం సంబంధం లేని విషయాలకు సామాజిక అంశాల పేరుతో సమస్యను తెర మీదకు తీసుకొచ్చి పవన్ లాంటోడు రియాక్ట్ కావాలనటం.. రియాక్ట్ కాకుంటే ఆయన వ్యక్తిగత అంశాల్ని తెర మీదకు తీసుకొస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువ అవుతుంది. పవన్ కామ్ గా ఉన్నా.. ఆయన్ను అభిమానించే వారు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాము స్పందించాలన్నది పవన్ ను కానీ.. ఆయన అభిమానులు కాదన్న చిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. దీనికి మద్దతుగా కొన్ని టీవీ ఛానళ్లు పని చేయటంతో పవన్ ను డీఫేమ్ చేయటం.. ఆయన క్యారెక్టర్ ను దెబ్బ తీసేలా విష ప్రచారం ఒకటి బలంగా మొదలైందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన రెండు ఉదంతాల్లో పవన్ ను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేయటం.. ఆయనపై తీవ్రంగా నోరు పారేసుకోవటం చూస్తే.. పవన్ ను దెబ్బ తీసేందుకు.. ఆయనపై కొత్త కొత్త వివాదాలు సృష్టించేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భావన కలగటం ఖాయం.

ఇలాంటి మరకల మీదా మౌనంగా ఉండటం వల్ల లాభమా? అంటే లేదనే చెప్పాలి. ప్రజారాజ్యం సమయంలో చిరు మాదిరి మౌనంగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. ఒకవేళ ప్రతి విషయానికి పవన్ స్పందించకున్నా.. ఈ తరహా ఉదంతాలపై రియాక్ట్ కావటానికి.. ధీటుగా బదులు ఇవ్వటానికి కొంత యంత్రాంగం అవసరమన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తనను టార్గెట్ చేసే వారిని చూసీ చూడనట్లుగా వదిలేయటంతో కొత్త గొంతులు పుట్టుకు వస్తున్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు.

పవన్ ను ఎంతగా విమర్శిస్తే.. అంతగా పేరు ప్రఖ్యాతులు రావటంతో పాటు.. మీడియాలో ప్రముఖంగా కనిపించొచ్చు అన్న విధానం మంచిది కాదని చెప్పక తప్పదు. ఇలాంటి విషయాల్లో కాస్తంత కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తమ మాటలకు పవన్ వెంటనే స్పందించాలంటూ అల్టిమేటం జారీ చేసే వారి స్థాయిల్ని పట్టించుకోకుండా.. అదే పనిగా కొన్ని టీవీ ఛానళ్లు హడావుడి చేయటం చూస్తుంటే.. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతుందా? అన్న సందేహం రాక మానదు. ఏమైనా.. మరక మంచిది కాదు.. మౌనం అంతకంటే మంచిది కాదన్నది పవన్ ఎప్పుడు గుర్తిస్తారో..? తాను మాట్లాడకున్నా ఫర్లేదు.. తన తరఫున బలంగా సమాధానం ఇచ్చే వారు.. ఇలాంటి వాటికి సంబంధించిన మూలాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*