చింతమనేనికి దిమ్మ తిరిగే సవాల్ విసిరారు

తన తీరుతో తరచూ వివాదాల్లో మునిగి తేలే ఏపీ అధికారపక్ష నేత.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు దిమ్మ తిరిగే సవాల్ ఒకటి ఎదురైంది. చిన్న చిన్న విషయాలకు సహనం కోల్పోవటం.. అధికారాన్ని ప్రదర్శించటం.. చేతిలో ఉన్న పవర్ ను అదే పనిగా దుర్వినియోగం చేయటం లాంటివి చింతమనేనికి సహజ లక్షణాలుగా పలువురు ఆరోపిస్తుంటారు.

ఈ తరహా ఆరోపణలు నిజమన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. తాజాగా ఇలాంటి ఉదంతమే ఒకటి తెర మీదకు రావటం తెలిసిందే. ఆర్టీసీ బస్సుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోస్టర్ కాస్త చినిగి ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేయటం.. బండ బూతులు తిట్టిన వైనం సంచలనం సృష్టించింది.

దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఊహించని రీతిలో సవాల్ విసిరారు. ఒక ఆర్టీసీ బస్సుపై ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు పోస్టర్ ను
చించేసిన ఆమె.. దమ్ముంటే తనపై దాడి చేయాలని సవాల్ విసిరారు.

ఉదయం 11 గంటలకు తాను హనుమాన్ జంక్షన్ వద్దకు వస్తానని.. దాడి చేయాలని ఛాలెంజ్ చేశారు. అయితే.. తన సవాల్ పై స్పందించని చింతమనేనిపై ఆమె తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సవాల్ విసిరినా పిరికిపందలా చింతమనేని రాలేదన్నారు.

బాబు తన పెంపుడు కుక్కల్ని ప్రజలపై దాడికి వదులుతున్నట్లుగా ఫైర్ అయిన ఆమె.. అధికారమదంతో చింతమనేని దాడులకు తెగబడుతున్నారన్నారు. అధికార మదంతో టీడీపీ నేతలు పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్న ఆమె.. దాడి చేసిన చింతమనేనిని వదిలేసిన పోలీసులు సామాన్యుల మీద కేసులు నమోదు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందంటూ సుంకర పద్మశ్రీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*