కేసీఆర్ వదల బొమ్మాళి..ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టుకు

తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పట్టుబడితే… ప్రత్యర్థిగా భావిస్తే ఎంత కసిగా పనిచేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి కసిని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత సీఎల్పీ ఉపనాయకుడైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటుగా ఆ పార్టీ విప్ అయిన ఎమ్మెల్యే సంపత్‌పై ప్రదర్శిస్తున్నారని చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తించడం వారి సభ్యత్వంపై వేటువేయడం..వారు కోర్టును ఆశ్రయించడం..తీర్పు అనుకూలంగా రావడం..ఇది కేసీఆర్‌కు ఎదురుదెబ్బ అని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయడం తెలిసిన సంగతే. అయితే ఈ ఎపిసోడ్‌ను కేసీఆర్ కసిగా తీసుకున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసు కేసు పెట్టించడంతో పాటుగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు గులాబీదళపతి సిద్ధమవుతున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. మార్చి 12న జరిగిన సంఘటన అసెంబ్లి లోపలి వ్యవహారం కాదని అది అసెంబ్లి వెలుపలి వ్యవహారమని తేల్చి చెప్పింది. అందువల్లనే తాము స్పష్టమైన తీర్పును ఇస్తున్నామని ఇది దేశానికే దిశానిర్దేశం చేసే తీర్పుల్లో ఒకటని న్యాయమూర్తి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – సంపత్ కుమార్ల సస్పెన్షన్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యయనం చేసి ముందుకు సాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరువురు ఎమ్మెల్యేల వేటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో న్యాయశాఖకు చెందిన ఉన్నతాధికారులు న్యాయ కోవిదులతో మంతనాలు జరిపినట్టు సమాచారం.

స్వామిగౌడ్‌పై జరిగిన దాడికి సంబంధించి ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భావిస్తే తాము ఇచ్చిన తీర్పు అడ్డంకిగా ఉండబోదని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వీరిపై కేసులు బనాయించేందుకు ముందుకు సాగుతున్నట్టు చెబుతున్నారు. ఓవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మరోవైపు క్రిమినల్ కేసు పెట్టడం ద్వారా ద్విముఖం గా ఈ సమస్యను ఎదుర్కోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో ఊరట లభించినా తీర్పును సమీక్షించే అధికారం శాసనసభాధిపతికి ఉందని ప్రభుత్వం భావిస్తోంది. హైకోర్టు తీిర్పు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో పాటు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై ఇయర్ ఫోన్ విసిరిన సంఘటనకు సంబంధించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కోమటిరెడ్డి సంపత్‌లపై కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. కోమటిరెడ్డి సంపత్ సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ఇందుకు రాజ్యాంగ నిపుణులు – అత్యుత్తమ న్యాయ కోవిదులతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు హైకోర్టు తీర్పును వెలువరించినా ఆ తీర్పును అమలు చేయాలా లేదా అన్నది నిర్ణయించే అధికారం శాసనసభాధిపతికి ఉంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల వేటు విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై తుదినిర్ణయం తీసుకోవలసింది స్పీకరేనని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*