అబద్ధాలు.. కుమారుడిని చితకబాదిన తండ్రి

ఓ తండ్రి మృగంలా ప్రవర్తించాడు. తన కుమారుడన్న సంగతి మరిచిపోయి.. దారుణంగా చితకబాదాడు. అమ్మకు అబద్ధాలు చెప్తావా.. అంటూ గొంతుపై కాలుపెట్టి బెదిరించాడు. ఈ ఘటన రెండు నెలల క్రితం బెంగళూరులో చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఓ దంపతులకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ పిల్లాడు నాన్నపై అమ్మకు అబద్దాలు చెబుతున్నాడని తండ్రి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కుమారుడిని మొబైల్ ఛార్జర్ వైర్‌తో సుమారు ఏడు సార్లు కొట్టాడు. అబద్ధాలు చెప్పొద్దని ఎన్ని సార్లు నీకు చెప్పాలని దండిస్తూ.. బెడ్‌పై కొడుకును ఎత్తేశాడు. పలుమార్లు బెడ్‌పై ఎత్తేసిన తండ్రి.. అంతటితో ఆగకుండా నేలకేసి కొట్టాడు. చితకబాదాడు. కుమారుడిని తన్నుతూ.. గొంతుపై కాలుపెట్టి బెదిరించాడు. ఈ తతంగాన్ని అంతా కుమారుడి తల్లి తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. అయితే ఇటీవలే ఆమె ఫోన్ పనిచేయకపోవడంతో.. రిపేర్ కోసమని మొబైల్ షాప్‌లో ఇచ్చింది. ఫోన్ రిపేర్ చేస్తున్న సమయంలో డాటాను భద్రపరిచే క్రమంలో కుమారుడిని చితకబాదిన వీడియో.. రిపేర్ చేసే వ్యక్తి కంటపడింది. దీంతో తక్షణమే ఆ వ్యక్తి.. ఓ ఎన్జీవో సంస్థకు వీడియోను చూపించాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా తండ్రి కుమారుడిని చితకబాదిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్జీవో సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*